న్యూఢిల్లీ, మార్చి 26: ఒకవైపు ఆర్థిక నష్టాలతో కాలం వెళ్లదీస్తున్న విమానయాన సంస్థలు..మరోవైపు కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించడానికి ఉవ్విళ్లూరుతున్నాయి మరో మూడు సంస్థలు. దేశీయ విమానయాన రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ ఏడాది కొత్తగా శంఖ్ ఎయిర్, ఎయిర్ కేరళ, అల్హింద్ ఎయిర్లు తమ విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నాయి. వీటికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాలు (ఎన్ఓసీలు) మంజూరయ్యాయి. కానీ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ల కోసం వేచి చూస్తున్నాయి. ఈ సర్టిఫికేట్ జారీ అయిన వెంటనే విమాన సర్వీసులు ప్రారంభించనున్నాయి.
డిపాజిట్లపై వడ్డీ కోత!
న్యూఢిల్లీ, మార్చి 26: బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లలో కోత పెట్టడానికి రెడీ అవుతున్నాయి. వచ్చే నెల తొలి నుంచి ఈ రేట్లకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తున్న పలు బ్యాంకులు.. మరోవైపు, డిపాజిట్లపై కూడా రేట్లలో మార్పులు చేయబోతున్నాయి. గత నెలలో రిజర్వు బ్యాంక్ రెపోరేటును పావు శాతం తగ్గించినప్పటికీ ఈ ప్రయోజనాన్ని ప్రధాన బ్యాంకులు ఖాతాదారులు బదిలీచేయలేదు.