Boeing 737 Max-DGCA | ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ తయారు చేసిన ‘న్యూ బోయింగ్ 737 మ్యాక్స్’ ప్యాసింజర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఐ) అప్రమత్తమైంది. దేశీయ విమానయాన సంస్థలకు అలర్ట్ జారీ చేసింది. విమానాలు టేకాఫ్ తీసుకునే ముందు విమానాలు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సూచించింది. ఆకాశ, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్ జెట్ వంటి సంస్థలతో నిరంతరం సంప్రదిస్తున్నామని తెలిపింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. యూఎస్ ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, బోయింగ్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు తెలిపింది. ఆకాశ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విమాన యాన సంస్థలు ప్రస్తుతం బోయింగ్ విమానాలను నడుపుతున్నాయి.
బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో రుద్దర్ కంట్రోల్ సిస్టమ్‌లో బోల్డ్ లూజ్‌గా ఉన్నట్లు యూఎస్ ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. బోయింగ్ విమానాల్లో తనిఖీలను సునిశితంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది. బోయింగ్ యాజమాన్యం సైతం తమ ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాల్లో సాంకేతిక లోపంపై రియాక్టయింది. ఒక విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించామని, ఆ విమానాలు నడుపుతున్న ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా తనిఖీ చేయాలని సూచించింది.
మరోవైపు ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్ జెట్ యాజమాన్యాలు స్పందించాయి. బోయింగ్ తమ 737 మ్యాక్స్ విమానాల్లో లోపం విషయమై తమకు సమాచారం ఇచ్చిందని ఆకాశ ఎయిర్ తెలిపింది. రెగ్యులేటర్ లేదా బోయింగ్ సూచనల మేరకు ఆ విమానాల్లో తనిఖీలు చేపడతామని చెప్పారు. నిర్ధిష్ట కాల పరిమితితో బోయింగ్ 737-8 విమానాలను తనిఖీ చేస్తున్నామని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వ్యాఖ్యానించింది. తాజా అలర్ట్ వల్ల తమ విమాన సర్వీసుల నిర్వహణపై ఎటువంటి ప్రభావం చూపదని స్పైస్ జెట్ పేర్కొన్నది.
విమాన యాన రంగ చరిత్రలో శరవేగంగా అమ్ముడైన విమానాల్లో బోయింగ్ 737 మ్యాక్స్ ఒకటి. కానీ 2019లో ఇండోనేషియా, జకార్తా విమాన ప్రమాదాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమాన యాన సంస్థలు ఈ విమాన సర్వీసుల నిర్వహణ నిలిపేశాయి. 2021 ప్రారంభంలో పూర్తి సర్వీసింగ్ తర్వాత ఈ విమానాలు వినియోగంలోకి వచ్చాయి.