Credit Card | న్యూఢిల్లీ, డిసెంబర్ 21: క్రెడిట్ కార్డుదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయిన క్రెడిట్ కార్డు ఉంటేచాలు ఇష్టంవచ్చినట్లు కొనుగోలు చేసి బిల్లులు ఎగవేసిన వారికి అత్యున్నత న్యాయస్థానం గట్టి షాకిచ్చింది. బకాయిలు చెల్లింపులు ఆలస్యమైతే ఇక మీ ఇష్టం వచ్చినట్లు వడ్డీరేట్ల మోత మోగించుకోవచ్చునని బ్యాంకులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. బిల్లులు చెల్లంచనివారిపై వడ్డీరేట్లు ఎంత విధించుకునేదానిపై బ్యాంకులదే తుది నిర్ణయమని కోర్టు స్పష్టంచేసింది. ఈ బకాయిలపై వడ్డీ పరిమితి ఉండాలన్న జాతీయ వినియోగదారుల పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) తీర్పును కోర్టు పక్కనపెట్టంది.
దీంతో నిర్ణీత గడువులోగా బిల్లు చెల్లించని వినియోగదారులపై పెద్దమొత్తంలో వడ్డీ వసూలు చేయడానికి బ్యాంకులకు మార్గం సుగమమైంది. క్రెడిట్ కార్డుల బిల్లుల ఆలస్య చెల్లింపులపై వార్షికంగా 30 శాతానికి మించి వడ్డీ వసూలుచేయరాదని 2008లో ఎస్సీఈడీఆర్సీ తీర్పు వెల్లడించింది. 16 ఏండ్ల క్రితం ఎస్సీఈడీఆర్సీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తిరిగిరాసింది. జస్టిస్ బెలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రత్యేక బెంచ్ ఈ కేసును విచారించి ఈ తీర్పునిచ్చింది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ప్రెస్, హెచ్ఎస్బీసీ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఈ ప్రత్యేక బెంచ్..క్రెడిట్ కార్డు బకాయిల ఆలస్య చెల్లింపులపై 30 శాతం నియంత్రణను ఎత్తివేస్తూ తీర్పును వెల్లడించింది.
క్రెడిట్ కార్డు బకాయిలపై ప్రధాన బ్యాంకులతోపాటు చిన్న బ్యాంకులు కూడా ఇష్టం వచ్చినట్లు వడ్డీరేట్లు వసూలు చేస్తున్నారని ఆవాజ్ ఫౌండేషన్ గతంలో ఎస్సీఈడీఆర్సీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన ఎస్సీఈడీఆర్సీ ప్రత్యేకంగా అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు బకాయిలపై తమ వడ్డీని 30 శాతానికి మించకుండా వసూలు చేయాలని గతంలో తీర్పునిచ్చింది.
దీనిపై దేశీయ, అంతర్జాతీయ బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ ఆలస్య చెల్లింపులపై గతంలో బ్యాంకులు 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుండేవి. అధిక వడ్డీ వసూలు చేస్తుండటంతో గతంలో క్రెడిట్ కార్డు బకాయిలు పూర్తిగా చెల్లింపులు జరపడం లేదా కనీస చెల్లింపులు జరిపేవారు తగ్గిపోయారు. క్రెడిట్ కార్డు లావాదేవీలపై 45 రోజుల వరకు ఎలాంటి వడ్డీని వసూలు చేయడం లేదని, కానీ కొందరు వీటిని అదనుగా చేసుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి.
క్రెడిట్ కార్డు బకాయిలు పెరగడంపై రిజర్వుబ్యాంక్ గతంలోనే ఆందోళన వ్యక్తంచేసింది. కార్డుల జారీపై నియంత్రణ విధించుకోవాలని, లేకపోతే బకాయిలు పేరుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయిన గతంలో హెచ్చరించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో ప్రధాన బ్యాంకులకు భారీ ఊరట లభించినట్లు అయిందని విశ్లేషకులు వెల్లడించారు. ఈ తీర్పుతో క్రెడిట్ కార్డు దారులు వెంటనే తమ బకాయిలు చెల్లించడానికి వీలు పడనున్నది.