న్యూఢిల్లీ, జనవరి 17: విమానాల రద్దు, ఆలస్యంతో గత ఏడాది డిసెంబర్లో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిన విమానయాన సంస్థ ఇండిగోకు దేశీయ విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ రూ.22.20 కోట్ల జరిమానా విధించింది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యవస్థాగత దిద్దుబాటుకు అనుగుణంగా రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారంటీని అందించాలని ఆదేశించింది.
వివిధ సమయాల్లో ఆరుసార్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడటంతో ఒక్కో ఉల్లంఘనకు రూ. 30 లక్షల చొప్పున మొత్తం రూ.1.80 కోట్ల జరిమానాను ఒకే విడతలో చెల్లించాలని ఆదేశించింది. ఇండిగో సంస్థ యాజమాన్యం.. సిబ్బంది, విమానాలు, నెట్వర్క్ వనరులను గరిష్ఠంగా వినియోగించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ అంతరాయాలను గ్రహించడానికి తక్కువ మార్జిన్‌ను వదిలిందని విచారణ నిర్ధారించింది.
ఇది రోస్టర్ సమగ్రతను, అంతరాయాలు ఏర్పడినప్పుడు పరిమిత రికవరీ ఎంపికలను గణనీయంగా దెబ్బతీసిందని తెలిపింది. విమాన కార్యకలాపాలు, సంక్షోభ నిర్వహణపై పర్యవేక్షణ లేకపోవడంపై ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌కు నియంత్రణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. సవరించిన ఎఫ్టీడీఎల్ నిబంధనల ప్రభావాన్ని అంచనా వేయడంలో విఫలమైనందుకు అకౌంటబుల్ మేనేజర్, సీవోవోలను హెచ్చరించారు.ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌ను పర్యవేక్షిస్తున్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ను కూడా హెచ్చరించింది. అతడిని ప్రస్తుత బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించారు. అతనికి ఎటువంటి జవాబుదారీ బాధ్యతలను ఆప్పగించరాదని పేర్కొంది.