న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ధరల పెరుగుదలలో పసిడి, వెండిలు నువ్వా..నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న వీటి ధరల కారణంగా సామాన్యుడు జంకుతున్నారు. గత నెలలో అయితే రెండంకెల స్థాయిలో పుంజుకున్నాయి. దీంట్లో వెండి మరో అడుగుముందుకేసి 19 శాతం ఎగబాకింది. సెప్టెంబర్ 1న రూ.1.26 లక్షల స్థాయిలో ఉన్న కిలో వెండి అదే నెలచివరి నాటికి రూ.1,50,500కి ఎగబాకింది. అంటే కేవలం 30 రోజుల్లోనే కిలో వెండి ఏకంగా రూ.24,500 ఎగబాకినట్టు అయింది.
ఇటీవలకాలంలో ఒకే నెలలో ఇంతటి స్థాయిలో ఎగబాకడం ఇదే తొలిసారి కావడం విశేషం. వెండికి పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు ముఖ్యంగా సౌర విద్యుత్, టెక్నాలజీ రంగాల నుంచి డిమాండ్ అంతకంతకు పెరుగుతుండటం కూడా ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడానికి ప్రధాన కారణమని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
బంగారం స్పీడ్‌కు బ్రేక్‌లు పడ్డాయి. వెండి ధరలతో పోలిస్తే పుత్తడి స్వల్పంగా ఎగబాకింది. గత నెలలో పదిగ్రాముల గోల్డ్ ధర రూ.14,330 లేదా 13.56 శాతం ఎగబాకింది. గత నెల మొదట్లో రూ.1,05,670గా ఉన్న పదిగ్రాముల ధర చివరి నాటికి రూ.1,20,000కి చేరుకున్నది. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, అమెరికా షట్‌డౌన్‌తో మదుపరులు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్ల నుంచి పుత్తడి మార్కెట్లకు తరలించడంతో వీటి ధరలు అధికమయ్యాయని కమోడిటీస్ మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. దేశీయంగా అమ్ముడవుతున్న వెండిలో 60-70 శాతం ఇండస్ట్రియల్ వినిమయానికి వినియోగిస్తున్నారు.
అలాగే సౌర ప్యానెల్ అప్లికేషన్లు అధికంగా ఉండటం, 2024లో 232 మిలియన్ ఔన్స్‌ల డిమాండ్ రావడం కూడా మరో కారణం. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, విద్యుత్‌తో నడిచే వాహనాలు కూడా ఉన్నాయని వెంచర్ హెడ్ ఎన్ఎస్ రామస్వామి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 3,871.81 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది. రెండు రోజుల క్రితం గోల్డ్ ధర రికార్డు స్థాయి 3,896.74 డాలర్లు పలికిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వెండి కూడా రెండు శాతం అధికమై 47.75 డాలర్లు పలికింది.