దేశీయ స్టార్టప్‌ల రంగంలో సంక్షోభం నెలకొన్నదా?..
నిధుల కొరత, వ్యాపార ప్రతికూలతలతో స్టార్టప్‌లు సతమతమవుతున్నాయా?
ఏడాదిలో ఏకంగా 18వేల మంది ఉద్యోగులను తీసేయడం ఇప్పుడు స్టార్టప్ ఇండియా భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఈ ఏడాది ఏకంగా 18,000 మంది ఉద్యోగులను దేశీయ స్టార్టప్‌లు తీసేసినట్టు ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ లాంగ్హౌజ్ కన్సల్టింగ్ చెప్తున్నది. నిధుల కొరత, వ్యాపార సవాళ్లను ఎదుర్కొంటున్న స్టార్టప్‌లు.. వ్యయ నియంత్రణ బాట పట్టాయి. మెజారిటీ స్టార్టప్‌ల్లోకి ఈ ఏడాది పెట్టుబడులే రాలేదని తేలింది. ఈ క్రమంలోనే మొత్తం 52 స్టార్టప్‌లు 17,989 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించినట్టు సదరు కన్సల్టెన్సీ వెల్లడించింది. కాగా, కొత్త ఏడాదిలోనూ కోతలు తప్పవని 65 శాతం స్టార్టప్‌లు ఈ తాజా సర్వేలో చెప్తుండటం ఇప్పుడు గుబులు పుట్టిస్తున్నది.
ఈ రంగాల్లోనే అత్యధికం
ఎడ్టెక్, కన్జ్యూమర్ సర్వీసెస్, ఈ-కామర్స్, హెల్త్‌టెక్, లాజిస్టిక్స్, ఫిన్‌టెక్, ఎంటర్ప్రైజ్టెక్, మీడియా-ఎంటర్టైన్మెంట్, అగ్రీటెక్, క్లీన్టెక్ రంగాల్లోని స్టార్టప్‌లలో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. కేవలం 15 ఎడ్టెక్ కంపెనీల్లోనే 44 శాతం ఉద్యోగ కోతలుండటం గమనార్హం. ఇందులో బైజూస్, అన్అకాడమీ, వేదాంతు, వైట్‌హ్యాట్ జూనియర్, టాపర్, ప్రాక్టికల్లీ, ఫ్రంట్‌రో, లిడో, ఇన్వాక్ట్ మెటావర్సిటీ, యెల్లో క్లాస్, టీచ్‌మింట్, లీడ్, ఉదయ్, క్రేజో.ఫన్, ఇరూడిటస్ స్టార్టప్‌లున్నాయి.
కారణం ఇదేనా..?
దేశంలో స్టార్టప్‌ల సంస్కృతి గత దశాబ్దకాలం నుంచి ఉన్నా.. కరోనా ఉద్ధృతితోనే బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సంప్రదాయ విద్య స్థానంలో ఆన్లైన్ విద్య వచ్చిపడింది. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో విద్యార్థులంతా తిరిగి బడుల్లోకే చేరారు. దీంతో విపరీతంగా పుట్టుకొచ్చిన ఎడ్టెక్ స్టార్టప్‌లకు ఒక్కసారిగా గిరాకీ తగ్గింది. ఫలితంగా వీటిల్లోని చాలామంది నిరుద్యోగులుగా మారాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గూగుల్‌లో 10వేల మందిపై వేటు?
కొత్త ఏడాది ఆరంభంలోనే గూగుల్‌లో 10వేల మందిని బయటకు పంపేలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే గూగుల్ రివ్యూస్ అండ్ డెవలప్మెంట్ (గ్రాడ్) అనే ఓ నూతన పనితీరు సమీక్షా వ్యవస్థను ఇప్పటికే గూగుల్ పరిచయం చేసింది. దీనిద్వారా దాదాపు 6 శాతం ఉద్యోగులను లో-ర్యాంకింగ్ కేటగిరీలోకి సంస్థ తీసుకెళ్లనున్నది. ఇదే జరిగితే 10,000 మంది ఉద్యోగాలను కోల్పోయే వీలుందని అంటున్నారు. మొత్తానికి ట్విట్టర్, అమెజాన్, మెటా వంటి భారీ సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుల్లో నిమగ్నమవగా, ఇప్పుడు గూగుల్ కూడా వీటి సరసన చేరుతున్నది. అమెజాన్ ఏకంగా 20వేల మందిని తీసేయాలని చూస్తుండటం గమనార్హం.