ముంబై, ఫిబ్రవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. బుధవారం కూడా సూచీలు నిరాశపర్చాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 122.52 పాయింట్లు లేదా 0.16 శాతం పడిపోయి 76,171.08 వద్ద ముగిసింది. అయితే ఒకానొక దశలో 905.21 పాయింట్లు లేదా 1.18 శాతం నష్టపోయి 76వేల స్థాయి దిగువకు చేరడం గమనార్హం. కానీ తిరిగి కొనుగోళ్ల మద్దతుతో సూచీ కోలుకున్నది. అయినప్పటికీ లాభాల్లోకి మాత్రం రాలేదు. ఇక ఈ నెల 5 నుంచి మార్కెట్లు నష్టాలకే పరిమితమవుతున్నాయి. దీంతో గత 6 రోజుల్లో మదుపరుల సంపద రూ.18,04,418 కోట్లు ఆవిరైపోయింది.
సెన్సెక్స్ 2,412.73 పాయింట్లు దిగజారింది మరి. మంగళవారం ఒక్కరోజే 1,018.20 పాయింట్లు క్షీణించిన విషయం తెలిసిందే. కాగా, బుధవారం లక్ష కోట్ల రూపాయలకుపైగా బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ హరించుకుపోయింది. ప్రస్తుతం ఈ విలువ రూ.4,07,46,408.11 కోట్లుగా ఉన్నది. ఇదిలావుంటే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 26.55 పాయింట్లు లేదా 0.12 శాతం తగ్గి 23,045.25 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 273.45 పాయింట్లు లేదా 1.18 శాతం పతనమై 23వేల మార్కుకు దిగువన 22,798.35 వద్దకు పడిపోయింది. 6 రోజుల్లో 694 పాయింట్లు లేదా 2.92 శాతం తగ్గింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు వాణిజ్య యుద్ధానికి దారి తీస్తాయన్న అంచనాలు మదుపరుల్లో బలంగా నెలకొన్నాయి. మరోవైపు విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూనే ఉండటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నది. బుధవారం ఒక్కరోజే రూ.4,969.30 కోట్ల పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు.