హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను ప్రారంభించి… కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైటెక్ సిటీలోని నాలెడ్జ్ పార్లో ‘వాన్ గార్డ్’ న్యూ ఇండియా ఆఫీస్(గ్లోబల్ వాల్యూ సెంటర్)ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారతో కలిసి ఆయన సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రస్తుతం విశ్వసనీయత, సమగ్రత, ఇన్నోవేషన్‌కు చిరునామాగా మారిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థల్లో ఒకటైన వాన్ గార్డ్ తమ ‘గ్లోబల్ వ్యాల్యూ సెంటర్(జీవీసీ)’ని ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఈ నగర సామర్థ్యానికి నిదర్శనమన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ ఒక కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మౌలిక వసతులు, వ్యాపార అనుకూల విధానాలు, ప్రతిభతో నిండిన ఎకోసిస్టమ్ కారణంగా ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ గమ్య స్థానంగా మారిందన్నారు.