న్యూఢిల్లీ, జనవరి 22: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మళ్లీ గాడినపడింది. గడిచిన నాలుగు నెలలుగా కస్టమర్లను కోల్పోయిన సంస్థ.. నవంబర్ నెలకుగాను కొత్తగా 12.1 లక్షల మంది వైర్లెస్ సబ్స్ర్కైబర్లు చేరారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 46.12 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు, తన ప్రత్యర్థి సంస్థలైన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం మొబైల్ వినియోగదారులను కోల్పోయాయి. భారతీ ఎయిర్టెల్ 11.4 లక్షల మంది సబ్స్ర్కైబర్లు కోల్పోగా, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ను 15 లక్షల మంది వైదొలిగారు. గత కొన్ని నెలలుగా వినియోగదారులను ఆకట్టుకున్న బీఎస్ఎన్ఎల్కు ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ నుంచి 3.4 లక్షల మంది వైదొలగడంతో మొత్తం సంఖ్య 9.20 కోట్లకు పరిమితమయ్యారు.