మనలో చాలామందికి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. వీటిల్లో తరచూ నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్ కూడా ఉండనే ఉంటాయి. ఇంటి కంటే బ్యాంక్ పదిలమని కొందరు.. అవసరమున్నప్పుడు తీసుకోవచ్చు అప్పటిదాకా ఖాతాలో ఉండే నగదుకు వడ్డీ వస్తుందని ఇంకొందరు భావించి డిపాజిట్లు చేస్తూ ఉంటారు. అయితే ఈ పొదుపు ఖాతాల్లో లావాదేవీలకు ముఖ్యంగా డిపాజిట్లకూ ఓ పరిమితి ఉంటుందని మీకు తెలుసా? ఈ పరిమితి దాటితే మీరు ట్యాక్స్ పేయర్ పరిధిలోకి వస్తారని గమనించారా? అసలు ఆదాయ పన్ను (ఐటీ) నియమ, నిబంధనలు ఏం చెప్తున్నాయి.
నల్లధనాన్ని నిరోధించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టేట్మెంట్లను సబ్మిట్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిందని ట్యాక్స్ నిపుణులు చెప్తున్నారు. సేవింగ్స్ ఖాతాల్లో నిర్దేశిత మొత్తాన్ని మించి లావాదేవీలు జరిగినైట్టెతే ఆ వివరాలను ఈ స్టేట్మెంట్లలో ఆయా సంస్థలు తెలియజేయాల్సి ఉంటుంది. పొదుపు ఖాతాల్లో నగదు వేసినా, తీసినా.. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ల్లో పెట్టుబడులు పెట్టినా.. క్రెడిట్ కార్డు ఖర్చులు, విదేశీ కరెన్సీల కొనుగోలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఇలా ఏం జరిగినా ఐటీ శాఖకు తెలిసిపోతుంది.
రోజులో లక్ష రూపాయలు, ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల రూపాయలు ఎవరికైనా చెందిన ఒకటి లేదా అంతకుమించిన సేవింగ్స్ అకౌంట్స్ల్లో డిపాజిట్ లేదా విత్డ్రా అయితే ఐటీ శాఖకు బ్యాంకింగ్ సంస్థలు, ఎన్బీఎఫ్సీలు ఆ వివరాలను తెలియపర్చాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చెప్తున్నది. అయితే కరెంట్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఇది వర్తించదు. కరెంట్ ఖాతాకు ఈ పరిమితి రూ.50 లక్షలు, ఆపైనే ఉన్నది. కాగా, ఈ లావాదేవీలకు కారణమైన నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందనే ఆర్బీఐ ఈ పరిమితుల్ని తీసుకొచ్చింది.
ఐటీ సెక్షన్ 1962లోని 114ఈ నిబంధన కిందే సేవింగ్స్ ఖాతాల్లోని పరిమితికి మించిన లావాదేవీలను ఐటీ శాఖకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చెప్తున్నాయి. అందుకే 114ఈపై అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అకౌంట్స్ నుంచి జరిగే ఆదాయ, వ్యయాలకు సంబంధించినదే ఈ రూల్. బ్యాంక్ ఖాతా సేవల్ని అందించే ప్రతీ బ్యాంకింగ్ సంస్థ, సహకార బ్యాంకులకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం వర్తిస్తుంది. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఏ లావాదేవీని బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలు దాచవు. సేవింగ్స్ ఖాతాల్లో మీరు వేసే, తీసే నయాపైసా లెక్కలోకి వస్తుంది. పరిమితి దాటితే పన్ను నోటీసులు ఖాయం. అధికారులకు సమాధానం చెప్పి, అవసరమైతే పన్నులు చెల్లించాల్సిందేనని మరువద్దు.