Paytm-RBI | సామాన్యుడి నుంచి కార్పొరేట్ సంస్థల వరకూ ఇప్పుడంతా అంతా ‘డిజిటల్‌మయం’ డిజిటల్ లావాదేవీలు.. ఆన్లైన్ పేమెంట్స్.. ఫిన్ టెక్ సంస్థలదే హవా.. కానీ, లాభాలార్జనే ధ్యేయంగా పని చేస్తున్న ఫిన్ టెక్ సంస్థలు ఇతర అంశాలేవీ పట్టించుకోవడంలేదు. దీనికి నిదర్శనం ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’ అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీబీఎల్) నిర్వహణ తీరు. సరైన వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టకుండానే వందల ఖాతాలు క్రియేట్ చేస్తున్నది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్.
దీని కారణంగానే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్ల స్వీకరణ, క్రెడిట్ ఫెసిలిటీ కల్పించకుండా పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పీపీబీఎల్ సరైన ‘నో యువర్ కస్టమర్ (Know Your Customer-KYC) – కేవైసీ’ నిబంధనలు అమలు చేయకుండానే తన ప్లాట్‌ఫామ్‌పై వందల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.కోట్లలో హవాలా లావాదేవీలు జరిగి ఉంటాయన్న సందేహాలు వెల్లువెత్తున్నాయి.
1000కి పైగా యూజర్లు తమ ఖాతాలకు ఒకే పాన్ నంబర్ (Permanent Account Number) ’ లింక్ చేసినట్లు పీపీబీఎల్ బయటి ఆడిటర్లు, ఆర్బీఐ నిర్వహించిన విచారణలో తేలింది. సరైన వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టకుండానే ఖాతాలు క్రియేట్ చేశారని తెలుస్తున్నది. వీటిలో కొన్ని ఖాతాల ద్వారా హవాలా లావాదేవీలు జరిగి ఉంటాయని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సందేహస్పద ఖాతాల వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి, కేంద్ర హోంశాఖ, ప్రధానమంత్రి కార్యాలయా (పీఎంఓ)నికి అందజేసినట్లు అధికార వర్గాల కథనం.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)లో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగినట్లు రుజువైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు. పేటీఎం, దాని అనుబంధ సంస్థల మధ్య జరిగిన ప్రధాన లావాదేవీల వివరాలను కూడా బయటపెట్టలేదన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే రెగ్యులేటరీ సంస్థల దర్యాప్తు పెరుగుతుందని పేటీఎం వర్గాల కథనం. ప్రత్యేకించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ మధ్య లింకేజీ, సుపరిపాలన ప్రమాణాల అమలులో లొసుగులు కనిపించాయి. పేరెంట్ యాప్ పేటీఎం ద్వారా డేటా ప్రైవసీ నిబంధనను అడ్డం పెట్టుకుని లావాదేవీలు జరిపారా అన్న అనుమానాలు రావడంతో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. కానీ తమ సంస్థపై ఎటువంటి నియంత్రణ సంస్థల చర్యలు ఉండవని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ చెప్పారు.