బెంగళూరు, జనవరి 7 : మైక్రోసాఫ్ట్..భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సును విస్తరించడానికి 3 బిలియన్ డాలర్లు(రూ.25 వేల కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. అలాగే 2030 నాటికి కోటి మందికి కృత్రిమ మేధస్సుపై శిక్షణ ఇవ్వనున్నట్లు బెంగళూరులో జరుగుతున్న కార్యక్రమంలో వెల్లడించారు. ఈ భారీ పెట్టుబడులతో ఏఐ ఆవిష్కరణలకు మరింత ఊతమివ్వనున్నదన్న ఆయన..ఎప్పటిలోగా పెట్టుబడులు పెడుతారనే విషయాన్ని స్పష్టంచేయలేదు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్..అజూరు బ్రాండ్‌తో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందిస్తున్నది. భారత్‌లో భవిష్యత్తులో ఏఐ నిపుణుల అవసరం పెద్ద సంఖ్యలో ఉంటుందని, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి యువత సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్నారు. దేశవ్యాప్తంగా వరల్డ్‌క్లాస్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయడానికి సంస్థ సిద్ధంగా ఉన్నదని, దీంతో పరిశోధన రంగం పూర్తిగా మారిపోతున్నదని చెప్పారు.