హైదరాబాద్, సెప్టెంబర్ 15 : హైదరాబాద్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ సెంటర్ను ప్రారంభించినట్టు ‘1 ఫైనాన్స్’ ప్రకటించింది. వ్యాపార విస్తరణలో భాగంగా దేశంలో థానే తర్వాత ఏర్పాటు చేసిన రెండో సెంటర్ ఇదే కావడం విశేషం. రాష్ట్రంలో వ్యక్తిగతంగా, కుటుంబాలకు ఆర్థిక సలహాలు ఇచ్చే వారు చాలా తక్కువగా ఉండటంతో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో చాలా మంది సతమతమవుతున్నారని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ మెహతా తెలిపారు.
సంస్థ ఎలాంటి ఉత్పత్తులను విక్రయించదని, అలాగే కమిషన్లు కూడా తీసుకోదని ఆయన స్పష్టంచేశారు. పన్ను చెల్లింపుల విషయాలతోపాటు బీమా, రుణాలు, పదవీ విరమణ తర్వాత తమ భవిష్యత్తు ప్రణాళికను ఎలా నిర్మించుకోవాలనే దానిపై ఈ సెంటర్ ప్రధానంగా సూచనలు చేయనున్నది.