SUV & MVP Cars | ధరల పెరుగుదల ప్రభావంతో బుల్లి కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టినా.. పెద్ద స్పోర్ట్స్ యుటిలిటీ (ఎస్యూవీ), మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ)కు డిమాండ్ పెరుగుతున్నది. గత ఐదు నెలల్లో కార్ల విక్రయాల్లో ఎంవీపీల గిరాకీ శరవేగంగా పెరుగుతున్నది. గతేడాదితో పోలిస్తే 2022-జనవరి-మే మధ్య 54 శాతం ఎక్కువ మల్టీ పర్పస్ వెహికల్స్ విక్రయాలు జరిగాయి. దాదాపు 1,38,136 యూనిట్ల ఎంవీపీలు అమ్ముడయ్యాయి. ఎంవీపీల్లో దక్షిణ కొరియా ఆటో మేజర్ కియామోటార్స్ కొద్ది నెలలుగా మార్కెట్లో 17 శాతం వాటా పెంచుకుంటున్నది.
ఇక ఎస్యూవీ కార్ల విక్రయాలు కూడా గతేడాదితో పోలిస్తే గత జనవరి-మే మధ్య 21 శాతం పెరిగాయి. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 5,65,384 ఎస్యూవీ కార్ల సేల్స్ జరిగాయి. ఎస్యూవీ కార్లలో టాప్-5 బెస్ట్ సెల్లింగ్ కార్లలో టాటా నెక్సాన్ మాత్రమే గత జనవరి-మే మధ్య విక్రయాల్లో తన వాటా పెంచుకున్నది.
కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పెద్ద కార్ల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశీయ కార్ల విక్రయ మార్కెట్లో ఎస్యూవీలు, ఎంవీపీల వాటా 47 శాతం ఉంటుంది. జనవరి-మే మధ్య కార్ల విక్రయాలు 14 శాతం పెరిగి 15,06,765 యూనిట్లకు చేరుకున్నాయి.