న్యూఢిల్లీ, నవంబర్ 11: టాటా స్టీల్ ఏకీకృత నికర లాభం గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2)లో ఎన్నో రెట్లు పెరిగింది. క్యూ2లో ఏకంగా రూ.12,547.70 కోట్ల లాభాలను అందుకున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) రెండో త్రైమాసికంలో రూ.1,665.07 కోట్ల లాభాలకే సంస్థ పరిమితమైంది. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)కు టాటా స్టీల్ తెలిపిన వివరాల ప్రకారం ఈసారి ఆదాయం రూ.60,55 3.63 కోట్లుగా నమోదైంది. నిరుడు ఇదే త్రైమాసికంలో రూ.39,157.79 కోట్లుగానే ఉన్నది. ఖర్చులు సైతం క్రిందటిసారితో చూస్తే రూ.37,000.28 కోట్ల నుంచి రూ.47,135.28 కోట్లకు పెరిగాయి.
స్టాండలోన్ ఆధారంగా..
స్టాండలోన్ ఆధారంగా సంస్థ నికర లాభం రూ.2,538.70 కోట్ల నుంచి రూ.8,707.26 కోట్లకు ఎగిసింది. ఆదాయం కూడా రూ.21,820.49 కోట్ల నుంచి రూ.32,964.39 కోట్లకు ఎగబాకింది. ఖర్చులు రూ.18,474.66 కోట్ల నుంచి రూ.21,233.99 కోట్లకు పెరిగాయి. అన్‌సీజన్ అయినప్పటికీ సంస్థ వ్యాపారం ఆకర్షణీయంగా సాగిందని, అందుకే అద్భుత ఫలితాలు వచ్చాయని ఈ సందర్భంగా టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ అన్నారు.