న్యూయార్క్/ముంబై, ఏప్రిల్ 22: తరలిపోతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు సహా మార్కెట్లో నెలకొన్న స్వల్పకాలిక ఒడిదుడుకులన్నింటినీ దగ్గరగా గమనిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. న్యూయార్క్‌లో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన రౌండ్-టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విదేశీ మదుపర్లకు దేశీయ మార్కెట్లను మరింతగా చేరువ చేయడానికి, సులభతర వ్యాపార నిర్వహణకు, రెగ్యులేటరీ విధివిధానాల సరళతరం కోసం చేపడుతున్న సంస్కరణల్ని వివరించినట్టు ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. కాగా, ఈ సమావేశానికి 100కుపైగా బ్యాంకింగ్, అసెట్ మేనేజ్మెంట్, క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థల ప్రతినిధులు, సంస్థాగత మదుపర్లు, వెల్త్ మేనేజర్లు హాజరయ్యారు.
పీపీఐ బలోపేతానికి..
ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలు (పీపీఐలు) దీర్ఘకాలిక వృద్ధి కోసం మరింత అనుకూల విధివిధానాల అభివృద్ధికి పలు చర్యలను ఆర్బీఐ బుధవారం ప్రతిపాదించింది. లావాదేవీ భద్రత పెంపు, రిఫండ్స్‌పై నిబంధనల్లో స్పష్టత, సమస్యల పరిష్కారం వేగవంతం వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కాగా, డిజిటల్ పేమెంట్స్ ఈ-మ్యాండేట్ విధివిధానాల్లో భాగంగా అప్డేటెడ్ రూల్స్‌ను ఆర్బీఐ ప్రకటించింది. రికరింగ్ లావాదేవీకి రూ.15,000 వరకు ఓటీపీ అవసరం లేదన్నది. ఇక బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్లు, క్రెడిట్ కార్డు చెల్లింపులకు ఈ పరిమితి లక్ష రూపాయలదాకా ఉన్నది.
రూపాయల్లో విదేశీ వాణిజ్యంపై..
భారత కరెన్సీ రూపాయల్లో అంతర్జాతీయ లావాదేవీలు జరిగేలా కృషి చేస్తున్నామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ స్పష్టం చేశారు. విదేశీ వాణిజ్యం కోసం డాలర్లపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించే దిశగానే వెళ్తున్నామని పేర్కొన్నారు. ఇక పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇటీవలికాలంలో రూపాయి విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తాత్కాలికమేనన్నారు. ఇదిలావుంటే 2024-25లో ఎఫ్‌డీఐ కంపెనీల నికర అమ్మకాల వృద్ధి 8.7 శాతంగానే ఉందని ఆర్బీఐ గణాంకాలు చెప్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 9.4 శాతంగా ఉన్నట్టు గుర్తుచేసింది.