చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి అనేక చిట్కాలు, పద్ధతులు పాటిస్తారు. స్కిన్ ఐసింగ్ కూడా అలాంటిదే. ‘నేనూ స్కిన్ ఐసింగ్ అభిమానినే’ అంటారు బాలీవుడ్ తార ఆలియా భట్. అసలే వర్షాలు. ఈ చల్లని వాతావరణంలో చర్మానికి ఐసింగ్ మంచిదేనా అంటే.. నిర్మొహమాటంగా చేసుకోవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు. ఐస్ క్యూబింగ్ వల్ల చర్మం తక్షణ కాంతిని పొందుతుంది. పాలిపోయిన చర్మానికి నిగారింపు వస్తుంది. జిడ్డు వదులుతుంది. మొటిమల నుంచి ఉపశమనం లభించడంతోపాటు రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.
చర్మంలోని సహజ నూనెలు బయటికి పోకుండా చూస్తూ.. సహజత్వాన్ని కాపాడుతుంది. స్కిన్ ఐసింగ్ వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. చర్మ రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది. స్కిన్ ఐసింగ్ వల్ల చర్మం దెబ్బతింటుందని, మరీ సున్నితంగా మారిపోతుందని చాలామంది అపోహ పడుతుంటారు. అయితే.. ఐస్ ముక్కను నేరుగా చర్మం మీద ఉంచకుండా సన్నని గుడ్డలో చుట్టి పెట్టుకోవాలి. కలబంద, దోసకాయ రసాలను ఐస్ ట్రేలో పెట్టి.. అవి ఐస్ ముక్కలుగా మారిన తర్వాత కూడా స్కిన్ ఐసింగ్ చేయవచ్చు. కాకపోతే, ఐస్‌ను ఎక్కువసేపు ఒకే చోట పెట్టకూడదు. చర్మమంతా సుతారంగా రుద్దాలి.