టమాట తొక్క మొదలుకొని గుజ్జు, రసం, విత్తనాల వరకూ అన్నీ చర్మానికి పోషణను అందించేవే. తాజా టమాటను ముఖానికి పట్టిస్తే.. మెరిసే కాంతి సొంతం అవుతుందంటున్నారు సౌందర్య నిపుణులు.
టమాట – తేనె
ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల టమాట గుజ్జును బాగా కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది.
టమాట – బొప్పాయి
రెండు టేబుల్ స్పూన్ల టమాట, బొప్పాయి గుజ్జులను కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. వృద్ధాప్య లక్షణాలు కనిపించవు. ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడవు.
టమాట – పసుపు
రెండు టేబుల్ స్పూన్ల టమాట రసంలో కొంచెం గంధం, తగినంత పసుపు వేసి పేస్టుగా చేసి ముఖానికి పట్టించాలి. తడి ఆరిపోయాక శుభ్రం చేసుకుంటే మేని ఛాయ మెరిసిపోతుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, టమాటలోని విటమిన్- సి, ఈ, బీటా కెరోటిన్.. స్కిన్‌టోన్‌ను పెంచేందుకు సహకరిస్తాయి.
టమాట – నిమ్మకాయ
ఒక టమాట నుంచి గుజ్జును వేరు చేసి, అందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. దానిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖంపై మొటిమల తాలూకు రంధ్రాలు కనుమరుగు అవుతాయి.
టమాట – క్యారెట్
ఒక టమాట, ఒక క్యారెట్‌ను మిక్సీ పట్టి పేస్టుగా కలిపి ముఖానికి పట్టించాలి. ఎండాక కడిగేసు కోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌తో మొటిమలు, పిగ్మెంటేషన్, ముడతలు నివారించవచ్చు.
హెచ్చరిక
టమాట చర్మానికి మంచిదే అయినా.. అతిగా వాడితే మాత్రం నష్టమే. టమాట ఫేస్‌ప్యాక్ వల్ల మంట, దురద వంటివి ఇబ్బందిపెడితే వెంటనే డెర్మటాలజిస్టును సంప్రదించాలి.