ఆడవాళ్లు అందానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందునా.. ముఖ వర్చస్సుకు మెరుగులు దిద్దుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇందుకోసం నానా రకాల సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటారు. కొందరు బ్యూటీ పార్లర్లకు క్యూ కడితే.. మరికొందరు ఇంటి చిట్కాలతోనే సరిపెట్టుకుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో తెలిసీతెలియకుండానే చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు. ఏది పడితే అది ఇష్టారాజ్యంగా వాడేస్తుంటారు. అలా అందాన్ని చేతులారా పాడు చేసుకుంటారు. అలా కావొద్దంటే.. కొన్నిటిని పక్కన పెట్టేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి చాలామంది ‘వ్యాక్స్’ను ఆశ్రయిస్తారు. అయితే, సరైనదాన్ని ఎంచుకోవడంలో పొరపాటు పడుతుంటారు. మహిళల చర్మతత్వాన్ని బట్టి ‘వ్యాక్స్’ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సున్నిత చర్మం ఉండేవారు.. కఠినమైన వ్యాక్స్ను వాడటం వల్ల ముఖ వర్ఛస్సు దెబ్బతింటుంది. ముఖంపై దద్దుర్లు రావడం, ఎర్రగా మారడం, ముడతలు పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఫేషియల్ వ్యాక్స్ వేసుకునే ముందు.. ఓసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలని చెబుతున్నారు.
ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడటంలోనూ ‘నిమ్మ పండు’ ముందుంటుంది. అయితే, చాలామంది దీనిని నేరుగా ముఖంపైనే అప్లయి చేస్తుంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. నిమ్మకాయలో ఉండే అధిక ఆమ్లత్వం.. చర్మానికి హాని కలిగిస్తుంది. ముఖం ఎర్రబడటం, చికాకు, దురద లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందులోనూ సున్నితమైన చర్మం, మొటిమలు ఎక్కువగా ఉన్నవాళ్లు.. నిమ్మకాయను నేరుగా వాడటం ఏమాత్రం మంచిది కాదు. దానికి బదులుగా తేనె, చక్కెర, నీటితో కలిపి నిమ్మకాయను చాలా తక్కువ మొత్తంలో వాడాలి. నిమ్మకు బదులుగా బంగాళాదుంప, టమాటా వంటివి ఎంచుకుంటే మరీ మంచిది.
చర్మానికి తేమను అందించే ‘బాడీ లోషన్’ను.. చాలా మంది ముఖానికి వాడుతుంటారు. దీనివల్ల ముఖం జిడ్డుగా మారుతుంది. బాడీ లోషన్లోని జిడ్డుదనం.. ముఖ చర్మ రంధ్రాల్లోకి చేరి మొటిమలు రావడానికి కారణం అవుతుంది. బాడీ లోషన్లో వాడే రసాయనాలతో చర్మంపై అలర్జీలు వస్తాయి. కాబట్టి, బాడీ లోషన్ను కాళ్లు, చేతులు ఇతర శరీర భాగాలకు మాత్రమే అప్లయి చేసుకోవాలి. ముఖం కోసం.. ఫేషియల్ బ్యూటీ ఉత్పత్తులనే ఎంచుకోవాలి.