Beauty Tips | అందంలో కొరియా అమ్మాయిలదే అగ్రతాంబూలం! ఎలాంటి మచ్చలు లేకుండా, గాజులా మెరిసే చర్మం.. వారి సొంతం! అందమే అసూయ పడేంత బ్యూటీగా ఉంటారు. ఎంతలా అంటే.. ప్రపంచ ప్రఖ్యాత బ్యూటీ ప్రొడక్ట్స్ సంస్థల్ని కూడా తమ చుట్టూ తిప్పుకొంటారు కొరియన్ కాంతలు. మరి, అలాంటి అందం, గ్లాసీలుక్ మీ సొంతం కావాలంటే.. కొరియన్లను ఫాలో కావాల్సిందే!
ట్యాపింగ్‌తో టాప్‌ర్యాంక్..
ఫేస్ ట్యాపింగ్.. కొరియన్ సీక్రెట్ బ్యూటీ టెక్నిక్! ఈ చిన్న చిట్కా.. అందంలో మీకు టాప్‌ర్యాంక్‌ను తెచ్చిపెడుతుంది. ముఖంపై సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా.. చర్మాన్ని సంరక్షించుకుంటారు వాళ్లు. ఫేస్ ట్యాపింగ్.. ముఖంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మం ముడతలు పడటాన్ని నిరోధిస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఫేస్ ట్యాపింగ్ చేయడం వల్ల.. ముఖంపై ఉండే చర్మం బిగుతుగా మారుతుంది. చర్మం చాలాకాలం పాటు తాజాగా, యవ్వనంగా ఉంటుంది.
ఆవిరితో అందం..
కొరియన్ యువతులు ఫాలో అయ్యే మరో బ్యూటీ సీక్రెట్.. ఆవిరి పట్టడం! మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరవడంలో, మృతకణాలను తొలగించడంలో ఆవిరి సాయపడుతుంది. చర్మం హైడ్రేట్ కావడంతోపాటు కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా చర్మం మరింత యవ్వనంగా కనిపిస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియానూ తొలగిస్తుంది. ఆవిరి పట్టిన తర్వాత ముఖంపై సున్నితంగా మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపడి.. చర్మం నునుపు దేలుతుంది.
వ్యాయామంతో వయ్యారంగా..
ముఖ వ్యాయామాలతో చర్మానికి సరికొత్త నిగారింపు వస్తుంది. అందుకే, కొరియన్ మహిళలు ఎక్కువగా ఫేషియల్ ఎక్సర్సైజులు చేస్తుంటారు. ఫేషియల్ యోగా, చీక్ లిఫ్ట్స్ వంటి కొన్ని వ్యాయామాలు.. ముఖంపై ఉండే అదనపు కొవ్వును కరిగిస్తాయి. పెదాలపై వేలుతో సున్నాలా చుట్టడం, నవ్వుతూ తలను పైకెత్తి చూడటం, నీటిని పుక్కిలించడంతోపాటు చూయింగ్ గమ్ నమలడం కూడా ఒకరకమైన ఫేషియల్ ఎక్సర్సైజే! వీటివల్ల ముఖానికి రక్తప్రసరణ బాగా జరిగి.. కొత్త నిగారింపు వస్తుంది.
రైస్ వాటర్‌తో నైస్‌గా..
రసాయనాల బ్యూటీ ఉత్పత్తులకు కొరియన్లు దూరంగా ఉంటారు. రైస్ వాటర్‌నే క్లెన్సర్‌గా వాడుకుంటూ.. నైస్‌గా తయారవుతారు. బియ్యం నీరు.. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ముఖంపై ముడతల్ని పోగొడుతుంది. ఇందులో అమైనో ఆమ్లాలు, యాంటి ఆక్సిడెంట్లు.. చర్మంలో తేమను కాపాడి, డ్రై స్కిన్ బారిన పడకుండా కాపాడతాయి. ముఖంపై ఉండే జిడ్డునూ సమర్థంగా తొలగిస్తాయి. ఫలితంగా.. చర్మం సరికొత్త మెరుపును సంతరించుకుంటుంది. ఫేషియల్ టోనర్లుగానూ దోసకాయ, పుచ్చకాయ, టమాటాలనే ఎక్కువగా వినియోగిస్తుంటారు.
.. ఇవేకాకుండా, సూర్యరశ్మి విషయంలోనూ కొరియన్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. చర్మం ముడతలు పడకుండా, ఎండబారిన పడకుండా నిత్యం సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటారు. సంప్రదాయ ఆహార పద్ధతులు పాటిస్తూ.. తమ అందాన్ని కాపాడుకుంటారు. చర్మ సంరక్షణలో సాయపడే గ్రీన్ టీ, బార్లీ టీనే ఎక్కువగా తాగుతుంటారు. పీచు, పోషక విలువలు ఎక్కువగా ఉండే పదార్థాలకే ప్రాధాన్యం ఇస్తారు. చర్మానికి హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. ఇలా కొరియన్ అమ్మాయిల పద్ధతులను ఫాలో కావడం వల్ల మీరుకూడా వారిలా మెరిసిపోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.