టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. ఢిల్లీలో చంద్రబాబు గురించి అందరికీ తెలుసునని సోమవారం మీడియాతో అన్నారు. ప్రధాని మోదీ అంతు తేలుస్తానని అన్న చంద్రబాబు… ఇప్పుడు వంగి వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఏనాడూ చంద్రబాబు రాష్ట్ర మేలు గురించి ఏనాడైనా ఆలోచించారా? అని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సోమశిల ప్రాజెక్టు నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇటీవల టీడీపీ ఆఫీసులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులుగా అనుమానిస్తున్నవారు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేశారు.