అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై (Pawankalyan) వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు మంత్రిగా ఎలా అయ్యారోనని, ఇంతకు ఆయనకు తెలివి ఉందా లేదోనని పేర్కొన్నారు. తాడేపల్లి నివాసంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల సరస్వతి సిమెంట్ కంపెనీ (Saraswati Cement Lands) భూముల పరిశీలించి చేసిన పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
సరస్వతి భూముల్లో ఎలాంటి ఆక్రమణలు లేవని స్వయాన తహసీల్దార్ ప్రకటించారని వెల్లడించారు. అధిక ధర చెల్లించి రైతుల వద్ద భూములను కొనుగోలు చేశానని వివరించారు. పర్యావరణశాఖకు మంత్రిగా ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా భూముల లీజు గురించి తప్పుగా మాట్లాడడం దౌర్భగ్యకరమని ఎద్దేవా చేశారు. 2014లోనే కేంద్రం భూముల లీజును 50 ఏళ్లకు పెంచిందని గుర్తు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు, కరెంట్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. సరస్వతి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ఫెయిల్ అయితే సంబంధిత మంత్రిని ప్రశ్నించాల్సింది కాదని చంద్రబాబును ప్రశ్నించాలని పవన్‌కు సూచించారు. చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదని, సినిమా డైలాగ్‌లు కొట్టమంటే కొడుతారని విమర్శించారు. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, ప్రశ్నించే వాళ్లు లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఐదు నెలలకాలంలో అందరినీ మోసం చేస్తున్నారని , అన్ని వ్యవస్థలను నీరుగార్చారని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చాక ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడు లేవని పేర్కొన్నారు.
అనతికాలంలోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందని, ఈ ప్రభుత్వం పడిపోవచ్చు. అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు అందర్నీ బయటకు తీస్తాం. సప్తసముద్రాలైన దాటి పట్టుకొస్తామని వెల్లడించారు. పోలీసులు బాధితులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని, బాధితుల ఉసురు మంచిది కాదు హితవు పలికారు.