YS Jagan | టీడీపీ నేతల దాడులపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందన్నారు. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై ట్విట్టర్ (ఎక్స్) వైఎస్ జగన్ స్పందించారు.
టీడీపీ యథేచ్ఛ దాడులతో రాష్ట్రంలో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని జగన్ అన్నారు. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయిందన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని.. వైసీపీ నుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోందని చెప్పారు. ఈ దాడుల ఘటనలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ను విజ్ఞప్తి చేశారు. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు వైసీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.