YS Jagan : టీడీపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ స్కామ్ జరిగిందంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఓ అభ్యర్థి విషయంలో జరిగింది సరైన, పారదర్శక విధానమేనా..? అని ముఖ్యమంత్రి చంద్రబాబును జగన్ నిలదీశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.
జగన్ తన పోస్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఒక అభ్యర్థికి 65 టెట్ మార్కులు వచ్చాయి. ఏడు దశల వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగం కేటాయించారు. అయితే ఆ తర్వాత అదే అభ్యర్థి అనర్హుడని డీఈవో నిర్ధారించారని తెలిపారు. అలాంటప్పుడు ఆ ఏడు దశల వెరిఫికేషన్‌లో ఏం జరిగిందని ప్రశ్నించారు. తనకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలియదని అభ్యర్థే చెప్పిన విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు.
విమర్శలు వెల్లువెత్తిన తర్వాత ఆ అభ్యర్థికి 2018 టెట్‌లో 77 మార్కులు వచ్చాయని అధికారులు చెప్పడంపై జగన్ సందేహాలు లేవనెత్తారు. ఆ మార్కులు ముందే ఉంటే.. డీఈవో ఎందుకు అనర్హుడని ప్రకటించారని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ 77 మార్కులు ఎస్జీటీ పోస్టుకు అవసరమైన పేపర్-I-A కు బదులుగా, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన పేపర్-II-B లో వచ్చాయని, అయినా ఎలా అర్హత కల్పించారని నిలదీశారు.
2018 టెట్ స్కోర్‌తోనే ఉద్యోగానికి అర్హత ఉంటే ఆ అభ్యర్థి 2025లో మళ్లీ టెట్ ఎందుకు రాశారని జగన్ ప్రశ్నించారు. ఇన్ని మలుపుల తర్వాత ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా జరిగిందని చెప్పగలరా..? అని అన్నారు. ఇది డీఎస్సీ స్కామ్‌ను ప్రోత్సహించడం కాదా..? అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు.