అమరావతి : భారతీయ పరిశ్రమలో అత్యంత ప్రముఖల్లో ఒకరైన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా(Ratan Tata) మృతిపట్ల వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అని ప్రశంసించారు. సమాజంకోసం, దేశ నిర్మాణానికి రతన్ టాటా అందించిన సహకారం, సేవలు స్ఫూర్తిదాయకమని ట్విట్టర్లో (Twitter) పేర్కొన్నారు.
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన పార్ధివదేహాన్ని కోల్బాలోని నివాసానికి తరలించారు. రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు. 8వ తరగతి వరకు ముంబైలోని కాంపియన్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత కేథడ్రల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో, శిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లోనూ చదివారు.
1955లో న్యూయార్క్‌లోని రివర్‌డేల్ కంట్రీ స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్ చేరి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ పూర్తిచేశారు. అదే ఏడాది టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. 1977లో ఎంప్రెస్ మిల్స్‌కు మారారు.
1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు చైర్మన్‌గా ఉన్నారు. మళ్లీ అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించారు.