AP News | కడప జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ భాస్కర్ కుమార్తె షర్మిల (18) ఇంటర్ చదివి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన కుళాయప్ప (25) తనను ప్రేమించాలని కొంతకాలంగా షర్మిల వెంట పడుతున్నాడు. ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఆ యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఇంట్లోకి చొరబడ్డాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. కానీ ఆమె వినిపించుకోకపోవడంతో కత్తితో 15 సార్లు దాడి చేశాడు. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన పులివెందుల ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
శనివారం రాత్రి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో యువతిని కడప నుంచి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికీ యువతి పరిస్థితి విషమంగానే ఉంది. కాగా, దాడికి పాల్పడిన కుళాయప్ప కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ విద్యాసాగర్‌తో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రుయా ఆస్పత్రి వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.