Harihara Veeramallu|ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ నాగబాబు మండిపడ్డారు. ఇది చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం సీతంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ.. వైసీపీని, ఆ నేతలను ఏమనాలో అర్థం కావడం లేదని తెలిపారు. వైసీపీ అరాచకాలపై పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం విషయంలోనూ వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని కూటమి నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని నాగబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం సమన్వయంతో సమర్థంగా పరిపాలిస్తోందని చెప్పారు. చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సమన్వయ కమిటీ పరిష్కరిస్తుందని తెలిపారు. ఇక మంత్రి పదవిపై నాగబాబు స్పందిస్తూ.. తనకు పదవులపై ఆశ లేదని తెలిపారు. జనసేన కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జనసేనలో ఎటువంటి కమిటీ వేయలేదని తెలిపారు. జనసేన సైనికులు ఓర్పుతో పార్టీకి అండగా నిలబడాలని నిలుపునిచ్చారు.
ప్రతి కార్యకర్తను జనసేన పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని నాగబాబు తెలిపారు. తాను ఉత్తరాంధ్రలోనే ఉంటానని.. నెలలో ఐదు నుంచి పది రోజుల పాటు ఉత్తరాంధ్ర జనసేన కార్యకర్తలను కలుస్తానని పేర్కొన్నారు. దామాషా ప్రకారం జనసేనకు నామినేటెడ్ పదవులు వస్తాయని చెప్పారు. మరికొద్దిరోజుల్లో జనసేన సభ్యత్వ నమోదు జరుగుతుందని.. జనసేన సభ్యత్వం ఏ కార్యకర్త ఎక్కువగా చేస్తారో వారినే నామినేటెడ్ పదవులు వర్తిస్తాయని తెలిపారు.