తాడేపల్లి : 2024లో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. రానున్న రెండేళ్లలో ప్రజల్లోకి ఏవిధంగా వెళ్లడం, 170 కి తక్కువ కాకుండా ఎలా సీట్లు సాధించడం అనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తున్నది.
వైసీపీ నేతలందరూ ప్రజల్లోనే ఉండాలని ఈ సమావేశంలో జగన్ కీలక సూచనలు చేసినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లేలా మంత్రులు, జిల్లా అధ్యక్షులు చర్యలు తీసుకోవాలని సూచించిన జగన్.. సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రయోజనాలు తెలుసుకునేల ప్రణాళికలు తయారుచేయాలని పార్టీ బాధ్యులకు తెలియజేశారని పార్టీ సీనియర్లు పలువురు చెప్పారు. త్వరలో జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నట్లు తెలుస్తున్నది. అదేమాదిరిగా జూలై 8 వ తేదీన పార్టీ ప్లీనరీని నిర్వహించేందుకు నిర్ణయించినట్లు పార్టీ నేతులు తెలిపారు.
నో ముందస్తు : కొడాలి నాని
మంత్రులు, జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ సూచించారని మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేరేలా నేతలంతా ప్రజల్లోనే ఉండాలని చెప్పారన్నారు. చంద్రబాబు కుయుక్తులను పార్టీపరంగా ఎదుర్కోవాలని సూచించారని తెలిపారు. వీరి కుయుక్తులను, కుట్రలను ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు చేపట్టాలని తమతో చెప్పినట్లు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి ఉండదని కుండబద్దలు కొట్టారు. పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు అందిపుచ్చుకోవచ్చునని జగన్ దిశానిర్దేశం చేశారన్నారు.