(MP Mithun Reddy) తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలపై వైసీపీ పార్లమెంట్ సభ్యుడు పీవీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన జగన్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని చంద్రబాబు శనివారం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మిథున్ రెడ్డి ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో కొత్తగా డెవలప్ చేసిన మొబైల్ యాప్ను మిథున్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఐదేండ్లపాటు అధికారంలో ఉంటుందని, ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తన పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.