అమరావతి : ఏపీకి చెందిన నరసాపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పేద వాడికి ఆహార భద్రతకు భరోసాగా ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీరం చేస్తుందని మండిపడ్డారు. ఆహార భద్రత పథకానికి ఆహారం ఇవ్వడం మానేసి డబ్బు ఇస్తామనడమేంటని ప్రశ్నించారు. కేంద్రం పేదవాడికి ఆహారం అందించేందుకు ప్రతి కిలోకు రూ. 28కు అందజేస్తుందని వివరించారు.
బియ్యం బదులు నగదు పంపిణీ చేస్తే ఒక్కరోజుల్లోనే ఆ డబ్బును వృథా చేస్తారని వివరించారు. కనీసం బియ్యం ఉంటే గంజి కాచుకుని తింటరాని ఆయన అన్నారు. అన్ని ధానాలకంటే అన్నదానం గొప్పదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో నెలకొల్పిన అన్న క్యాంటీన్ల ద్వారా అనేక మందికి కడుపు నిండా అన్నదానం దొరికేదని అటువంటి స్కీంను వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని ప్రభుత్వం ఎత్తివేస్తుందని ఆరోపించారు.
ఆకలి విలువ ఆకలితో ఉన్న వారికే తెలుసని, పేదవాడికి పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లు తీసేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఏపీ సీఎం జగన్, నూతన మంత్రులు ఆహార భద్రతను పేదవాడి నుంచి దూరం చేయవద్దని సూచించారు.