అమరావతి : ఏపీలో కల్తీ మద్యం విక్రయాల వల్ల వైసీపీ నాయకులు వందల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని టీడీపీ సీనియర్ నాయకుడు బొండా ఉమ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపీలో చిన్నచిన్న డిస్టిలరీను తరిమివేసి వాటిని లీజుకు తీసుకుని జే బ్రాండ్ మద్యం తయారు చేసి సుమారు 350 కోట్ల రూపాయలను సంపాదించారని విమర్శించారు.
రాష్ట్రంలో అమ్ముతున్న కల్తీ జే బ్రాండ్ మద్యం ఏపీలోనే దొరుకుతుందని దేశంలో మరెక్కడా దొరకదని అన్నారు. రాష్ట్రంలో ఇష్టారీతిన మద్యం బ్రాండ్లు సృష్టించి పేదల ఆరోగ్యంతో చెలగాటమాడారని పేర్కొన్నారు. పార్టీ నిజ నిర్ధారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం జే బ్రాండ్ గ్యాంగ్‌లోని10 మంది కీలక సభ్యుల్లో ఒకరు అందజేసిన జే బ్రాండ్ మద్యం సమాచారాన్ని వెల్లడిస్తున్నానని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఇష్టారీతిన మద్యం విక్రయించి దోచుకున్నారని మండిపడ్డారు.
2014 -19 వరకు టీడీపీ హయాంలో ఎర్రశేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం ఎవరైనా దొంగిలించాలంటే కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఒకసారి టాస్క్‌పోర్సు పోలీసులు 40 మంది ఎర్రచందనం స్మగ్లరను కాల్చి చంపారని తెలిపారు. స్మగ్లింగ్ చేయాలంటే టీడీపీ పాలనలో స్మగ్లరు భయపడేవారని తెలిపారు. కాని జగన్ పాలన ఎర్రచందనానికి రక్షణ కరువైందని, ఎర్రచందనం విచ్చలవిడిగా స్మగ్లింగ్ జరుగుతుందని, వీటి వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు.