Pulivendula | పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత మేరుగు నాగార్జున ఆరోపించారు. ప్రజాస్వామ్యం కాపాడుతుందనే నమ్మకంతోనే వైసీపీ ఎన్నికలకు వెళ్తుందని.. కానీ మాపై దాడులు చేసి.. మాపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది న్యాయమా? ధర్మమా అని ప్రశ్నించారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై డీజీపీ కార్యాలయంలో వైసీపీ ప్రతినిధి బృందం ఆదివారం నాడు వినతి పత్రం సమర్పించింది. అధికార టీడీపీ పార్టీకి తొత్తులుగా మారి పోలీసులే చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. దీనిపై తక్షణమే స్పందించాలని వైసీపీ ప్రతినిధి బృందం ఆ లేఖలో కోరింది. దేశంలో ఎక్కడా చూడని విధంగా రాష్ట్రంలో పోలీసులు ఇంతగా అధికార పార్టీకి లొంగిపోయి, చట్టాలనే అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీ స్పందించి, ప్రజాస్వామ్య రక్షణకు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ఈ నెల 5వ తేదీన ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తున్న ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులపై కర్రలు, ఇనుపరాడ్లు, రాళ్లతో పది వాహనాల్లో వచ్చిన టీడీపీ అరాచక శక్తులు దాడులకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ దాడిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీ వద్దకు వెళ్తే ఆయన కూడా పట్టించుకోలేదని అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే టీడీపీ వారికి అండగా నిలబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని పోలీసు వ్యవస్థే నీరుగారుస్తోందని ఆరోపించారు.
పోలీసు యంత్రంగాన్ని చేతుల్లో పెట్టుకుని అధికార టీడీపీ చేస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మేరుగు నాగార్జున విమర్శించారు. ఇటువంటి దారుణ పరిస్థితుల్లోనూ వైసీపీ శ్రేణులు ఎక్కడా భయపడకుండా ముందుకు సాగుతుంటే.. దాన్ని కూడా సహించలేక ఎవరైతే మాపై దాడులు చేశారో.. వారి నుంచే ఫిర్యాదులు తీసుకుని.. బాధితులైన వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం ఈ ప్రభుత్వ అరాచకానికి, పోలీసు వ్యవస్థ దిగజారుడుతనానికి పరాకాష్టగా కనిపిస్తోందని విమర్శించారు. ఇంత అమానుషంగా చంద్రబాబు పాలన సాగుతుందని మండిపడ్డారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.