Pawan Kalyan | వైసీపీతో పాటు ఇతర పార్టీ నేతలు మన శత్రువులు కాదు.. ప్రత్యర్థులు మాత్రమే అని పవన్ కల్యాణ్ అన్నారు. చేతగాక కాదు.. కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచివి కాదని తెలిపారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని జనసేన కార్యకర్తలకు సూచించారు. వ్యక్తిగత దూషణలు చేయవద్దని అన్నారు. వైసీపీ చేసిన తప్పులు మనం చేయకూడదని తెలిపారు. అలాగని వైసీపీ చేసిన తప్పులు సహించలేమని అన్నారు. చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పవన్ కల్యాణ్ సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇది కూటమి విజయమని తెలిపారు. కూటమి పార్టీలో ఎవర్నీ కించపరచవద్దని జనసైనికులకు పవన్ కల్యాణ్ సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలిపారు. కుటుంబ రాజకీయాలు వద్దని.. వారసులను తీసుకురావద్దని సూచించారు. వారసులు వస్తే కొత్త నాయకత్వం ఎలా వస్తుందని ప్రశ్నించారు. క్రమశిక్షణారాహిత్యంతో తనకు తలపోటు తీసుకురావద్దని హితవు పలికారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కుటుంబ సభ్యులను పిలవద్దని వార్నింగ్ ఇచ్చారు. కూటమిలో ఉన్నాం కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేస్తానని తెలిపారు. పదవులు ఉన్నా లేకున్నా పనిచేయాలని స్పష్టం చేశారు.
బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. జనసైనికులు, వీరమహిళలు తనవైపు బలంగా నిలబడ్డారని.. ఎలాంటి పదవి ఆశించకుండా పోరాడారని పేర్కొన్నారు. ఎంత సాధించినా తగ్గి ఉండటం చాలా అవసరమన్నారు. ఊహించని మెజార్టీతో గెలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం అవుతానని అనుకోలేదని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు. భారీ విజయంతో జనసేన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు.