Vidadala Rajini | తనపై దుష్ప్రచారం చేస్తూ.. తప్పుడు కేసులు పెడుతున్నారని ఏపీ మాజీ మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాపై, నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టిన వాళ్లను వదిలిపెట్టనని హెచ్చరించారు. టీడీపీ నాయకుల మెప్పు కోసం తప్పుడు ఫిర్యాదు ఇస్తున్నారని మండిపడ్డారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావును విడదల రజిని శనివారం నాడు కలిశారు. తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది టీడీపీ నాయకులు తమపై తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఆ ఫిర్యాదులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి, తనను భయపెట్టాలని అనుకుంటున్నారని.. ఆ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ ఇక్కడ లేరని స్పష్టం చేశారు.
ఇప్పటికే నాపై ఏడు తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా బనాయించారని తెలిపారు. కొంతమంది పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు వాళ్ల నాయకుల మెప్పు కోసం తప్పుడు ఫిర్యాదులు నమోదు చేస్తుంటే, అధికారులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిని, తప్పుడు కేసులు పెట్టిన అధికారిని ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.