గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని నిందితుడిగా చేర్చారు. ఏ-71 నిందితుడిగా పేర్కొంటూ ఆయనపై కేసు నమోదుచేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, పలువురు వైసీపీ నాయకులు దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు టీడీపీ నేతలపై దాడికి దిగారు. వల్లభనేని వంశీ ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే వైసీపీ కార్యాలయంపై దాడికి దిగారని అప్పట్లో టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఆ విధ్వంసానికి సంబంధించి టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సత్యవర్దన్ ఫిర్యాదు మేరకు ఐపీసీ 143, 147, 148. 435, 506 రెడ్‌విత్, 3(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరాలు, వీడియోలను పరిశీలించడం ద్వారా దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. మొత్తంగా 71 మంది టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో 15 మంది బుధవారం అరెస్టు చేసి గన్నవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.