Gauthu Sirisha | పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా గౌతు శిరీష ఎమ్మెల్యే స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కాశీబుగ్గలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నీచ రాజకీయాలు చేస్తూ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.
అభివృద్ధి గురించి మాట్లాడటం, తాత తండ్రుల గురించి చెప్పుకోవడం కాదని.. గతంలో నే మంత్రిగా చేసిన అభివృద్ధి ఏంటో.. 60 ఏండ్లలో మీ గౌతు కుటుంబం చేసిన అభివృద్ధి ఏంటో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని సీదిరి అప్పలరాజు అన్నారు. నీకు, నాకు అసలు పోలిక ఏంటి అని గౌతు శిరీషను సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. నీ గురించి మా ఇంట్లో కుక్కలు కూడా మాట్లాడుకోవని అన్నారు. నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ప్రజలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అది నీ స్థాయి.. నువ్వు నా గురించి మాట్లాడతావా అని మండిపడ్డారు. గౌతు శిరీష నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికి వచ్చినట్లు అవినీతి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఎమ్మెల్యేగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీదిరి అప్పలరాజు సూచించారు. తనను మాటిమాటికీ పశువని, భాషా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తాను ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేనని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ పాడైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.