వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అరెస్టుచేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మధురైలో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కొత్తపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గౌరీశంకర్రావు ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలో శ్రీకాంత్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.
వాలంటీర్ హత్య కేసులో శ్రీకాంత్‌ను మూడు రోజుల క్రితం తమిళనాడులోని మధురైలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్‌ను అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్‌పై తాజాగా ఏపీకి తీసుకొచ్చారు. మంగళవారం రాత్రి ఆయన్ను కొత్తపేట డీఎస్పీ ఆఫీసుకు తీసుకొచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గౌరీశంకర్రావు ముందు హాజరుపరిచారు. శ్రీకాంత్‌కు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన వాలంటీర్ జనువల్లి దుర్గాప్రసాద్ 2022 జూన్ 6వ తేదీన హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక పినిపె శ్రీకాంత్ హస్తం ఉందని ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి.. కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మళ్లీ ముందుకు సాగింది. ఈ కేసులో ఉప్పలగుప్తం మండలానికి చెందిన వడ్డీ ధర్మేశ్ హస్తం ఉందని నిర్ధారించి ఈ నెల 18న అతన్ని అరెస్టు చేశారు. వడ్డీ ధర్మేశ్‌ను విచారించి కీలక వివరాలు సేకరించారు. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించేందుకు నిర్ణయించిన శ్రీకాంత్.. ధర్మేశ్ సాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం.