AP News | అదానీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.1750 కోట్లు లంచం తీసుకున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. అదానీ విషయంలో జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంపై ప్రచారంలో ఉన్నవన్నీ అభూతకల్పనలే అని కొట్టిపారేశారు. వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో మాత్రమే ఒప్పందం చేసుకుందని.. అదానీ కంపెనీతో కాదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు అదానీ కంపెనీలకు, జగన్‌కు సంబంధమేంటని ప్రశ్నించారు.
ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఆనాడు సెకీతో ఒప్పందం చేసుకోకపోతే, కచ్చితంగా మరో రకంగా జగన్‌పై విమర్శలు చేసేవారని కాకాణి మండిపడ్డారు. రూ.2.49కే యూనిట్ విద్యుత్ ఇస్తామన్న కూడా ప్రభుత్వం లాలూచీ పడి తీసుకోలేదని విమర్శించే వారని తెలిపారు. నరం లేని నాలుకను ఎటైనా తిప్పి మాట్లాడతారని విమర్శించారు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో యూనిట్‌కు రూ.5.10 చెల్లించి విద్యుత్ కొనుగోలు చేశారని గుర్తుచేశారు. అదే మా ప్రభుత్వ హయాంలో రూ.2.49కి కొనుగోలు చేస్తే ఒప్పు చేసినట్లా? తప్పు చేసినట్లా అని నిలదీశారు.
వైయస్ జగన్ మోహన్‌రెడ్డి గారి వల్లే బాలినేని మంత్రి అయ్యాడు.@ncbn దగ్గర మెహర్బానీ కోసం ఇన్ని అబద్ధాలు మాట్లాడతాడని అనుకోలేదు.
టేబుల్ అజెండా కింద ఎన్నో నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది.
ఈ-ఫైలింగ్ సిస్టం ఉండగా తెలియకుండా సంతకం పెట్టానంటూ బాలినేని అనడం హాస్యాస్పదం.-కాకాణి… pic.twitter.com/acRzhVgH5Z
— YSR Congress Party (@YSRCParty) November 25, 2024
సెకీతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందాన్ని పెద్ద భూతంలా మాజీ మంత్రి బాలినేని ప్రచారం చేస్తున్నారని కాకాణి మండిపడ్డారు. వైఎస్ జగన్ దయతో బాలినేని ఎమ్మెల్యే, మంత్రి అయ్యారని అన్నారు. అలాంటి ఆయన ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించలేదని అన్నారు. పవన్ కల్యాణ్ దగ్గర మెహర్బానీ కోసమే ఈ ఆరోపణలు చేసినట్లు అనిపిస్తుందని చెప్పారు. వైఎస్ జగన్ గురించి, ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడటానికి బాలినేనికి మనసుఎలా ఒప్పిందో ఆలోచించుకోవాలని అన్నారు.
అర్ధరాత్రి ఫైల్ వచ్చిందని బాలినేని అబద్ధాలు చెబుతున్నారని కాకాణి అన్నారు. ఆ సమయంలో ఈఫైలింగ్ విధానం అమలులో ఉండగా.. ఇలా దారుణంగా మాట్లాడటం తగదని బాలినేనికి హితవు పలికారు. ఎవరి దగ్గర తన స్థాయిని పెంచుకోవడానికి మాట్లాడుతున్నాడో, ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నాడో తమకు అనవసరమని అన్నారు. తమ నాయకుడిపై బురద జల్లడం మాత్రం భావ్యం కాదని తెలిపారు.