Gudivada Amarnath | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి, వైసీసీ నేత గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. రూ.931 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( ఏడీఆర్ ) ఇచ్చిన నివేదికపై పలు ప్రశ్నలు సంధించారు. రెండెకరాల నుంచి వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. తన ఆస్తులపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తమ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో మూడు లక్షల కోట్ల అప్పు చేస్తే.. వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం లక్షా 12 వేల కోట్ల అప్పు చేసిందని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నేడు రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో 400 కోట్లు ఉంటే దేశంలోనే ధనిక సీఎం వైఎస్ జగన్ అని ప్రచారం చేశారని గుడివాడ అమర్నాథ్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు. రెండెకరాలతో వెయ్యి కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆస్తుల పక్కన ఇంకా ఒకటో రెండో సున్నాలను ఏడీఆర్ మరిచిపోయి ఉంటుందని ఎద్దేవా చేశారు. ఉంగరాలు, వాచీ, ఫోన్ పెట్టుకోనంత మాత్రన ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర ఆస్తులు లేవంటే ప్రజలు నమ్మరని విమర్శించారు.
వైసీపీకి ఈ ఏడాది చేదు జ్ఞాపకాలు ఇచ్చిందని గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎన్నికల ఫలితాలు ఎన్నో పాఠాలు నేర్పించాయని తెలిపారు. పార్టీని, నిర్ణయాలను సమీక్షించుకునే అవకాశం కల్పించాయని చెప్పారు. ప్రజలు తీసుకున్న నిర్ణయం మంచిదే అనిపించేలా ఈ కూటమి పాలన లేదని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఈ ఏడాది వైసీపీ, కూటమి ప్రభుత్వాల మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన పార్టీ కూటమి పార్టీ అని.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ వైసీపీ అని తెలిపారు. కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ పథకాల ఊసే లేదని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఒక్కో మహిళకు రూ.1500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల ఆర్థిక శక్తి క్షీణించిపోయిందని అన్నారు. చివరికి దేవుడి గుడిలోని హుండీలో కూడా డబ్బులు వేయలని దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఇంతకీ చంద్రబాబు తెచ్చిన లక్ష కోట్ల అప్పు అంతా ప్రజలకూ చేరక, పథకాలకూ అమలు కాక ఏమైనట్లు అని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని కూడా అక్కడికి ఎంపీకి తెలియదట అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ నిర్దేశకత్వంలో ప్రజా వ్యతిరేక పాలనపై వైసీపీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.