Chevireddy Bhaskar Reddy | రాజకీయ కక్షలతో తన కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేశారని వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. విదేశాల్లో చదివిన తన కొడుకును వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు పెట్టినప్పటి నుంచి గత వారం రోజులుగా తుమ్మలగుంటలనే ఉన్నా తన కుమారుడి అరెస్టు చేయలేదని అన్నారు. కానీ ఘటన జరిగిన 52 రోజుల తర్వాత స్నేహితుడి వివాహానికి దుబాయి వెళ్తుంటే.. బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.
తాను విద్యార్థి దశ నుంచే ఉద్యమాలతో పెరిగానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గుర్తు చేశారు. తన కన్నా మించి మోహిత్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడి ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు రుచి చూపిస్తాడని తెలిపారు. ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
బెంగళూరు ఎయిర్‌పోర్టులో మోహిత్ రెడ్డి అరెస్టు
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్యాయత్నం చేశారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శనివారం రాత్రి అరెస్టు చేశారు. తండ్రి భాస్కర్ రెడ్డి, తమ్ముడు హర్షిత్ రెడ్డితో కలిసి దుబాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బెంగళూరులోని దేవనహళ్లి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మోహిత్‌పై ఏపీ సిట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో.. బోర్డింగ్ పాస్ చెక్ చేసే సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు.
తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలోని బృందం చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం తిరుపతిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కాసేపు విచారించిన అనంతరం 41ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలేశారు. విదేశాలకు వెళ్లకుండా ఆయపై ఆంక్షలు విధించారు.