Chevireddy Bhaskar Reddy | తను ఏ తప్పు చేయలేదని ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తానెప్పుడూ లిక్కర్ జోలికి పోలేదని తెలిపారు. తాగుడు వల్లే మా నాన్న, తమ్ముడు చనిపోయారు.. అందుకే లిక్కర్‌ను ద్వేషిస్తానని పేర్కొన్నారు. లిక్కర్‌ను ద్వేషించే తనను లిక్కర్ కేసులోనే అరెస్టు చేయడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలోని ఏసీబీ కోర్టు ముందు శుక్రవారం నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఏడో తరగతి చదివేటప్పుడు మా నాన్న తాగుడు వల్ల అమ్మ ఆత్మహత్య చేసుకుంది. అదే తాగుడు వల్ల మా నాన్న చనిపోయారు. తాగుడుతోనే మా తమ్ముడు చనిపోయాడు.. అందుకే నేను లిక్కర్‌ను ద్వేషిస్తా. లిక్కర్ జోలికి వెళ్లను’ అని తెలిపారు. లిక్కర్‌ను ద్వేషించే నన్ను అదే లిక్కర్ కేసులో అరెస్టు చేయడం బాధగా ఉందన్నారు.
13 ఏళ్లుగా వేద పాఠశాల నడిపిస్తున్నానని.. అందులో 160 మంది పిల్లలు చదువుతున్నారని తెలిపారు. మద్యం వ్యాపారం చేస్తే నైతికంగా హక్కు కోల్పోతామని.. ఇది ధర్మం కూడా కాదని అన్నారు. ప్రతి మనిషి బతకాలంటే వ్యాపారం చేయాలని.. తాను కూడా వ్యాపారం చేసుకుంటున్నానని తెలిపారు. అదే లిక్కర్‌తో సంబంధం ఉన్న పెట్టుబడులు పెట్టి ఉంటే ఆస్తులు అటాచ్మెంట్ చేయడం కాదు.. స్వాధీనం చేసుకోండని సవాలు విసిరారు. కానీ లిక్కర్‌తో సంబంధం లేకుండా చేస్తున్న మా వ్యాపారం.. మా కొడుకు మీద పడుతున్నారని మండిపడ్డారు. ఇది న్యాయం కాదని అన్నారు. కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. పైన దేవుడు ఉన్నాడని.. అన్నీ ఆయనే చూసుకుంటారని వ్యాఖ్యానించారు.