Are Shyamala | ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల నిప్పులు చెరిగారు. రాబంధుల స్వైర విహారంలో ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలే అరాచకవాదులుగా మారిపోయారని, వారిని చూసి మహిళలు హడలిపోతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు మొత్తం నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటలు ఫాలో అవుతున్నారని వ్యాఖ్యానించారు. అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపు చేయాలని అప్పట్లో బాలయ్య చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేల వేధింపులు ఇటీవల వివాదాస్పదంగా మారడంపై తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరె శ్యామల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మహిళల బాధ్యత తమని అన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ గత 15 నెలలుగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు మహిళా ఉద్యోగుల పాలిట రాక్షసులుగా మారారని ఆరోపించారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
అధికారుల మీద జులుం చెలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారని ఆరె శ్యామల నిలదీశారు. ‘ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య మీద ఎమ్మెల్యే రవికుమార్ దాష్టీకానికి దిగారు. రాత్రి సమయాల్లో కూడా తన ఆఫీసులో ఉంచడం ఏంటి? అర్ధరాత్రి వీడియో కాల్స్ చేయడం ఏంటి? గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అరాచకాలను తట్టుకోలేక సూఫియా అనే మహిళ ఆత్మహత్యకు యత్నించారు. కూటమి నేతలు రాబందులుగా మారారు. పోలీసులకు మొర పెట్టుకున్నా.. వాళ్లు పట్టించుకోవడం లేదు. ‘ అని తెలిపారు. ఈ పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బయటకొచ్చి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
సౌమ్య ఆత్మహత్యాయత్నంపై హోంమంత్రి అనిత ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం బాధితుల తరఫున ఏనాడూ నిలవడలేదని తెలిపారు. పైగా అన్యాయం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు.