AP News | సార్వత్రిక ఎన్నికల్లో కాపుల ఓట్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ గంపగుత్తగా కూటమికి వేయించారని ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా తెలిపారు. ఇప్పుడు కాపుల్ని బీసీల్లో చేర్చడం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యతే అని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా కాకినాడలోని తునిలో వైఎస్సార్ విగ్రహానికి దాడిశెట్టి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కాపుల్ని బీసీల్లో చేర్చడానికి కేంద్రం సానుకూలంగా ఉందని అన్నారు. కాపుల్ని వీకర్స్ సెక్షన్లో చేర్చాలా? ఎఫ్ కోటాలో చేర్చాలా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో ప్రత్యుత్తరాలు జరుపుతుందని తెలిపారు. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్తశుద్ధితో కాపులకు న్యాయం చేయాలని కోరారు. కేంద్రం సానుకూలంగా ఉంది కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ కల్పిస్తే కాపులందరూ బాగుపడతారని వెల్లడించారు. లేదంటే కాపులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచినట్టేనని విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉండటానికి తమకేమీ ఇబ్బంది లేదని దాడిశెట్టి రాజా తెలిపారు. ప్రతిపక్షంలో ఉండటం తమకు కొత్త కాదని కూడా పేర్కొన్నారు. 2010 నుంచి 2019 వరకు వైసీపీ ప్రతిపక్షంలోనే ఉందని గుర్తుచేశారు. ఇప్పుడు మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉంటామని.. అందులో తమకేమీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.