Ambati Rambabu | వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జనసేన కార్యకర్త దాడి ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ముద్రగడ ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని అడిగితే.. నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుంటున్నాడని తెలిపారు. దీంతో దాడి చేసిన వ్యక్తి జనసేన కార్యకర్త అని స్పష్టమైందని అన్నారు.
ఇలాంటి దౌర్జన్యాలను డిప్యూటీ సీఎం ప్రోత్సహించడం సమంజసం కాదని అంబటి రాంబాబు అన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఖండించకపోతే ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలను ప్రోత్సహించినవారమవుతారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఈ ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని.. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నూతనంగా వచ్చిన డీజీపీ కూడా కోరుతున్నానని చెప్పారు.
మరోవైపు ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని ఆయన కుమార్తె, జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి తీవ్రంగా ఖండించారు. నాన్నగారి ఇంటిపై దాడి జరిగిందని తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎటువంటి దాడులకు అయినా వ్యతిరేకమే అని స్పష్టం చేశారు. దాడి వెనుక ఎంత పెద్దవారున్నా.. బయటి తీసి చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. మతిస్థిమితం లేని వ్యక్తి ఈ దాడికి పాల్పడి ఉంటాడని అనుమానంగా ఉందని అన్నారు.