Ambati Rambabu | ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. నారా లోకేశ్‌కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని ఆరోపించారు. లోకేశ్ రెడ్‌బుక్‌కు, అరెస్టులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. అప్పుడు మీ నాన్నను అరెస్టు చేశారని.. కనిపించిన వాళ్లందర్నీ అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. లోకేశ్ ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు.
తిరుపతిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైసీపీలో ఏ ఒక్కరూ భయపడరని అన్నారు. మా పార్టీ నాయకులపై అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని తెలిపారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడతామని చూస్తే దీని ప్రతిఫలం కచ్చితంగా అనుభవించక తప్పదని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని.. అధికార మదంతో లోకేశ్ ఉన్నాడని విమర్శించారు.
తన తల్లి నారా భువనేశ్వరిని అమానించాడంటూ లోకేశ్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని అంబటి రాంబాబు విమర్శించారు. నేను ఈ రోజు ఆయన తల్లిని అవమానించలేదని స్పష్టం చేశారు. దీనిపై విచారణ చేయించుకోండని సూచించారు. మీ నాన్న చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారని.. కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా? అని ప్రశ్నించారు. ఎంతమందిని జైలులో పెడతారని.. జైల్లో పెడితే బయటకు రాలేమా.. మీరు ఏమైనా చంపేస్తారా? జైలులో నుంచి మీ నాన్న చంద్రబాబు బయటకు రాలేదా అని మండిపడ్డారు.
ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైందని అంబటి రాంబాబు అన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు ఏయడం లేదనే ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తున్నారని తెలిపారు. ఆయన్ను ఓడించామనే బాధతో ప్రజలు ఈ సభలకు తరలివస్తున్నారని చెప్పారు. వచ్చే మూడేళ్లలో వైసీపీ ఎంత బలపడుతుందో ఊహించుకోండని వ్యాఖ్యానించారు.