Ambati Rambabu | కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడ్డుకోవడంపైనా అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. అప్పటికే కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యాన్ని చూడటానికి పవన్ కల్యాణ్ సాహసోపేతంగా వెళ్లారని ఎద్దేవా చేశారు. గుంటూరులోని వైసీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. తీరా ఒడ్డుకు వచ్చిన తర్వాత విచిత్రమైన ఆరోపణలు చేశారని విమర్శించారు. రెండు నెలల నుంచి అక్కడికి వెళ్తానంటే అధికారులు అడ్డుపడుతున్నారని.. వారు సహకరించడం లేదని పవన్ కల్యాణ్ ఆరోపించారని గుర్తుచేశారు. అసలు ఆయన ప్రభుత్వంలో ఉన్నారో.. లేదంటే ప్రశ్నించే పక్షంలో ఉన్నారో అర్థం కావడం లేదని చెప్పారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికడతామని చెప్పిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. దీనికి బాధ్యత వహిస్తారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అధికారులు తనను అడ్డుకున్నారని పవన్ కల్యాణ్ అంటున్నారని.. బహుశా చంద్రబాబు, నారా లోకేశ్ చెప్పడంతోనే అధికారులు అడ్డుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఉప ముఖ్యమంత్రికి అంతలా ప్రాధాన్యం ఇవ్వద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమోనని అన్నారు.
కూటమి నేతల సహకారంతోనే ఈ స్కామ్ జరుగుతుందని అంబటి రాంబాబు ఆరోపించారు. ఎమ్మెల్యే కొండబాబుకు మామూళ్లు వెళ్లకుండానే ఇదంతా జరుగుతుందా అని నిలదీశారు. బియ్యం అక్రమ రవాణాకు బాధ్యత వహిస్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ చెప్పే డైలాగులకు తగ్గట్లే ఆయనకు లెక్కలేనంత తిక్క ఉందని అన్నారు. అందుకే కాకినాడ పోర్టు నుంచి ఆర్డీఎక్స్ రావచ్చని, కసబ్ లాంటోళ్లు వస్తారని.. దీనిపై అమిత్ షాకు లేఖ రాస్తానని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో ఉన్నారా? ప్రశ్నించే ధోరణిలో ఉన్నారా? అనేది అర్థం కావడం లేదని అన్నారు.
కూటమి ప్రభుత్వంపై ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. సంపద సృష్టించడం కంటే కూడా సంపద సృష్టించుకుంటాం.. అంతా మేమే దోచుకుంటాం అన్నట్లుగా ప్రభుత్వ పెద్దల తీరు ఉందని విమర్శించారు. అవినీతి, దోపిడీలపైనే కూటమి నేతలంతా దృష్టి పెడుతున్నారని ఆరోపించారు.