Ambati Rambabu | ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. అప్పుల పేరుతో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. అప్పులున్నా సరే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చంద్రబాబు అప్పట్లో చెప్పారని గుర్తు చేశారు.
చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని జగన్ అప్పుడే చెప్పారని అంబటి రాంబాబు గుర్తుచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నిజం బయటపడిందని అన్నారు. చంద్రబాబు దావోస్ పర్యటనకు ఎందుకు వెళ్లారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. దావోస్‌కు వెళ్లి పైసా పెట్టుబడి కూడా తీసుకురాలేదని విమర్శించారు. గతంలో గ్లోబల్ సమ్మిట్‌కు వెళ్లి రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఊదరగొట్టారని గుర్తుచేశారు. ఆ 10 లక్షల కోట్లు ఎక్కడ పెట్టుబడి పెట్టారని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాలు కూడా వస్తున్నాయని చెప్పారని.. అవి ఎవరికి ఇచ్చారో బయటపెట్టాలని అన్నారు. దావోస్ పర్యటనకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నారా లోకేశ్ రెడ్‌బుక్‌కు మా ఇంట్లో కుక్క కూడా భయపడదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.