అమరావతి : వైసీపీ (YCP ) కి చెందిన ఇద్దరు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేస్తుండడంపై టీడీపీ ఎమ్మెల్యే స్పందించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌రావు ఇంట్లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ( MLA Ganta Srinivas rao) మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇక వైసీపీ మునిగిపోయే నావ (Sinking boat) లాంటిదని తాము ముందే చెప్పామని అన్నారు.
పార్టీకి, పదవులకు రాజీనామా చేసి టీడీపీ(TDP) లో చేరుతామంటే స్వాగతిస్తున్నామని వెల్లడించారు. పరిస్థితిని చూస్తుంటే వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగిలేల లేదని వ్యాఖ్యనించారు. ఈ పరిస్థితికి కర్త, కర్మ, క్రియ జగన్ కారణమని గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. తాము గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ముందుకు వస్తే వారిని పార్టీలోకి తీసుకుంటామని చెప్పారు.
2019లో 151 సీట్లు ఇస్తే ఐదేళ్ల కాలంలో జగన్ పాలనను చీకటి రాత్రిగా ప్రజలు భావిస్తున్నారని ఆరోపించారు. అందుకే 2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లకే పరిమితం చేశారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజల బాగోగులు కోరితే మరో ఐదేళ్లకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనైనా జగన్‌కు ప్రతిపక్ష హోదా వస్తుందని పేర్కొన్నారు.