అమరావతి : వైసీపీ (YCP) హయాంలో ఆ పార్టీకి 21 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి ఒక్క మేలు చేయలేక పోయారని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ( Kolusu Parthasarathi ) ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మంగళవారం మీడియా సమావేశంలో విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించిందని వెల్లడించారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు (Visaka Steel) కర్మాగారాన్ని కాపాడేందుకు కేంద్రం రూ. 11 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించడం కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆంధ్రు పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు , దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని అన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ, ప్లాంట్ కార్మికుల సుదీర్ఘ పోరాటాలు ఫలించాయని అన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తికి కేంద్రంలోని ఎన్టీయే అన్ని విధాలా సిద్ధంగా ఉందని వివరించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు పెట్టిస్తున్నామని స్పష్టం చేశారు.