AP Politics | ఏపీ రాజ్యసభ అభ్యర్థులపై వైసీపీ అధినేత, సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేస్తున్న వైసీపీ.. ఇప్పటికే ఆయా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు(ఎస్సీ), మేడ రఘునాథ్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ఈ ముగ్గురి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ నెల 8వ తేదీన మాక్ పోలింగ్ నిర్వహించే యోచనలో వైసీపీ ఉంది.
ఏప్రిల్‌లో మొత్తం 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీవిరమణ చేయనున్నారు. వారిలో ఏపీ నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రబాబు, బీజేపీ నుంచి సీఎం రమేశ్‌బాబు పదవీకాలం ఏప్రిల్‌లో అయిపోతుంది. ఏప్రిల్ 2వ తేదీన వీరు పదవీవిరమణ చేయనున్నారు. ఈ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు జరగనున్నాయి. మెజారిటీ పరంగా ఈ మూడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికై కసరత్తు చేసిన వైసీపీ.. ముగ్గుర్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. దీంతో వేమిరెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గొల్ల బాబురావును ఎంపిక చేశారని సమాచారం. అలాగే మేడ రఘునాథ్ రెడ్డికి కూడా ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈ మూడు స్థానాల అభ్యర్థుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరనుంది.